గొదరోళ్ళ
మజాకానా
ఎప్పుడో 1910లో మాటలెండి..
పనులేవో గుత్తకి తీసుకుందారని సర్కారోళ్ల ఆఫీసులోకొచ్చిన కాంట్రాక్టర్ అడ్డూరి రామచంద్రరాజుగారి చూపు ముసుగేసున్న ఓ మిషను మీద పడింది..
ఇంతకు ముందు చూసినాటిలా లేదిది, ఏదో తేడాగా ఉందీ మిషననుకున్నారు బుగ్గమీద చేయ్యేసుకుని.. అక్కడికక్కడే బేరమాడి కొనుక్కునొచ్చి ఇంటివసరాలో బిగించేరు..
కొనుక్కునంటే వచ్చేరు గానీ ఎలావాడాలో తెలీక చాలాచోట్ల తిరిగేరు..
ఆఖరికి వాల్తేరురేవులో సుంకం కట్టించుకునే తెల్లదొరల్ని కలిసాక తెల్సిందేంటంటే అదొకరకం షోడా తయారుజేసే యంత్రమని తేలింది.. !!
కిందామీదా పడి మొత్తానికి ఎలావాడాలో నేర్చుకుని నీళ్ళూ, గ్యాసు కలిపి సీసాల్లోకి పట్టడం మొదలెట్టేడు రామచంద్రరాజుగారు..
తీరా పట్టాకా ఈ గ్యాస్ షోడా తయారుజెయ్యడానికంటే దాన్ని జనాల్తో తాగించడానికెక్కువ కష్టమైపోయింది ఆ అడ్డూరి రాజుగారికి..
మూతతీస్తుంటే చాలు బాంబు పేలినట్టున్న ఆ గ్యాస్ సౌండుకే భయపడిపోతన్నారంతా..
అటూఇటూ తిరుగుతుండే యుద్ధసైనికులు తాగడం మొదలెట్టారు ముందు.. చులాగ్గా తాగేస్తన్న ఆ బ్రిటీషోళ్ళని జూసి మెల్లిగా అలవాటు పడ్డారు జనాలు..
రామచంద్రరాజుగారి తమ్ముడు ఏదో పనుండి మద్రాసెళ్లి స్పెన్సర్స్ డ్రింక్ చూసొచ్చి ఆ డ్రింకు తాలూకూ వాళ్ళతో కాంట్రాక్ట్ మాట్టాడుకుని అక్కడ్నించి ముడిసరుకు ఇక్కడికి దిగుమతి చేస్కుని డ్రింకుతయారీ మొదలెట్టేరు..
బాగానే వెళ్తంది వ్యాపారం..
ఆలోగా రెండో ప్రపంచయుద్ధం వచ్చింది.. అన్ని రంగాల్లోనూ దేశాలమధ్య వాణిజ్యపరమైన ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి..
అప్పటికి దేశంలో ఉన్న ఆరేడు కూల్డ్రింకులు కూడా ఆగిపోయాయ్ బయట్నించి ముడిసరుకు రాక..
అవతల కలకత్తా నించొచ్చే బెహ్రాన్ డ్రింకు ఆగిపోయింది..
బొంబాయివాళ్ళ డ్యూకోకి దెబ్బడిపోయింది..
ఢిల్లీ రోజర్స్ బ్రాండ్, హైద్రాబాద్ నవాబ్ గారి అల్లావుద్దీన్ బ్రాండుల్ని కూడా ఆపేశారు..
మధురై నొంచొచ్చే విన్సెంటు, మద్రాసులో తయారయ్యే స్పెన్సర్స్ బుడ్లుకి కూడా కష్టంగా ఉంది..
ఇక్కడ డ్రింకు తయారుజెయ్యడానికి చూస్తేనేమో సరుకు లేదు.. 'ఇప్పుడెలా' అనుకున్నారు అన్నదమ్ములిద్దరూనూ..
రాత్రంతా ఆలోచించి పొద్దున్నే సూర్యుడు రాకుండానే బయల్దేరిపోయి మంచి కాపుమీదున్న తియ్య రాతినారింజలు కోసుకొచ్చేరు.. చిన్నపాటి వగరు కూడా ఉంటుంది మన్యంసైడు దొరికే ఆ రాతినారింజకి..
ఆ కాయలకి నిమ్మరసం కలిపి ఓ కొత్తరకం డ్రింక్ తయారుచేశారు..
మార్కెట్లోకి వదలగానే ప్రత్యకమైన రుచితో బాగా పేరెళ్ళింది జనాల్లోకి..
అప్పటి జనం దాన్ని అడ్డూరి రామచంద్రరాజుగారి కలర్ కాయన్నారు.. బ్రిటిషోళ్ళు ఏ.ఆర్ డ్రింకన్నారు.. ఒకప్పుడు ముడిసరుకు ఇచ్చిన స్పెన్సర్స్ అయితే మాక్కూడా మీరే తయారుజేసి పెట్టండన్నారు..
కానీ ఆ అన్నదమ్ములిద్దరూ మాత్రం తమకి ఎంతో ఇష్టమైన ఆ ఆటోమేటిక్ మిషన్ పేరు, రామచంద్రరాజుగారిది కలిసొచ్చేలా ఏదైనా పేరు పెట్టుకుందామనుకున్నారు.. !!
ఆ డ్రింక్ పేరే..
తయారైందగ్గర్నించీ ప్రత్యేకమైనరుచితో దాదాపు వందేళ్లపాటు మార్కెట్లో నిలబడి,
మధ్యలో కోకోకోలా కంపెనీకి అమ్మకందాకా వెళ్ళిపోయి పేరుమార్చేస్తానంటే ఇష్టపడక వెనక్కొచ్చి కార్పొరేట్ కంపెనీల పోటీకి ఎదురునిలిచి ఇప్పటికీ ఉనికిని నిలుపుకున్న రామచంద్రపురం స్పెషల్ 'ఆర్టోస్ డ్రింక్'..
వందేళ్ల చరిత్ర ఉన్న ఈ డ్రింకు గోదావరి జిల్లాలకు మాత్రమే సొంతం..